హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్ర‌వారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

శుక్ర‌వారం ఉదయం పూట అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో మండపాన్ని రూపొందించారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు దానిలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమమంతా కంకణభట్టర్‌ శ్రీ శ్రీ‌నివాస ఆచార్యులు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. వాహనసేవలో ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీ‌మ‌తి గౌత‌మి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీసుభాష్, శ్రీ చ‌ల‌ప‌తి పాల్గొన్నారు.

Share this post with your friends