గంగ జాతరకు నేడు చాటింపు.. ఈ అర్థరాత్రి దాటితే..

నేడు తిరుపతి గంగజాతరకు చాటింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభం కానుంది. బుధవారం బైరాగివేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. ఈ నెల 21 వరకూ జాతర జరగనుండగా, 22వ తేదీన తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఈ ఏడు రోజుల పాటు భక్తులు వివిధ వేష ధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ గంగమ్మ జాతర ఎప్పుడు జరుగుతుంది? తదితర విశేషాలేంటో చూద్దాం.

తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం అంటే ఈ ఏడాది మే 14న చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అయిన అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలతో కూడిన సారెను అమ్మవారికి తీసుకు వస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకూ ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.

Share this post with your friends