ఆ ముగ్గురికీ వైకల్యాన్ని తొలగించిన వినాయకుడు..

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి గురించి తెలియని వారుండరు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు రాష్ట్రంలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో ఉంది. ఈ స్వామివారు బావిలో స్వయంభువుగా వెలిశాడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని కొన్ని శాసనాల ప్రకారం తెలుస్తోంది. మరి ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసా? పూర్వం మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గరు అన్నదమ్ములు ఉండేవారట. ఆ ముగ్గురూ కాణిపాక ప్రాంతంలోనే నివసించే వారు. వారికి కొంత భూమి ఉండేది. ఆ భూమిలో ఏతం తొక్కడానికని ఒకరోజు ఒక చిన్నబావిని తవ్వాలనుకున్నారు.

అనుకున్నదే తడవుగా ముగ్గురూ కలిసి బావిని తవ్వారు. చక్కగా నీరు పడింది. ఆ నీటితో సేద్యం చేసుకుంటూ హాయిగా జీవించేవారు. కొంత కాలానికి ఆ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీంతో బావిలోని నీరు వారికి సరిపోలేదు. దీంతో బావిని ఇంకాస్త లోతు తవ్వాలనుకున్నారు. అలా తవ్వుతుండగా.. గునపం ఒక రాయికి తగిలి దాని నుంచి రక్తం చింది ఆ ముగ్గురు అన్నదమ్ములపై పడింది. ఆ వెంటనే వారి వైకల్యం పోయి సాధారణ మనుషులుగా మారిపోయారు. విషయం తెలుసుకున్న కాణిపాకం గ్రామ ప్రజలు బావి తవ్విన ప్రదేశానికి చేరుకుని మట్టిని శుభ్రపరిచి చూశారు. దానిలో వారికి వినాయకుని విగ్రహం కనిపించింది. అక్కడే స్వామివారికి ఓ ఆలయం నిర్మించారు. అదే కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం.

Share this post with your friends