ఇప్పటి వరకూ కరెన్సీ నోట్లతో రూపొందించిన వినాయకుడిని చూశాం. ఒళ్లంతా బంగారం, వజ్రాభరణాలు ధరించిన కాస్ట్లీ వినాయకుడిని చూశాం.. కాయిన్స్‌తో తయారు చేసిన వినాయకుడు.. కుల వృత్తిని ప్రతిబింబించే వినాయకుడిని చూశాం… అలాగే టీ 20 వరల్డ్ కప్ థీమ్ కూడా చూశాం. ఇక పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఓ వినాయకుడిని ప్రతిష్టించారు. ఏకంగా 1800 కలశాలతో కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో ఏర్పాటు చేశారు. తిరుపతిలోని యాదవ వీధి, సున్నపువీధికి చెందిన యూత్ ప్రతి ఏటా వినాయక చవితి సంబరాలు నిర్వహిస్తూ ఉంటుంది.
ఈ ఏడాది కాస్త వినూత్నంగా ఆలోచించిన యూత్ సభ్యులు పర్యావరణానికి ముప్పు కలగకుండా కలశాలతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్యూర్ కాపర్‌తో తయారు చేసిన 1800 అష్టలక్ష్మి కలశాలతో వినాయకుడిని రూపొందించారు.11 రోజుల పాటు నలుగురు ఆర్టిస్టులు.. 10 మంది సాయంతో కష్టపడి ఈ వినాయకుడిని రూపొందించారు. ప్రతి కలశంపై మనకు అష్టలక్ష్మి ప్రతిమ కనిపిస్తుంది. 150 గ్రాముల వెండి జంజం బొజ్జ గణపయ్యకు నిర్వాహకులు ధరింప చేశారు. వినాయక చవితి రోజు ప్రతిష్టించిన విగ్రహాన్ని 9 వరోజు ఆదివారం నిర్వాహకులు నిమజ్జనం చేయనున్నారు.