
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌర్ణమి గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రస్తుతం వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల కొండపై పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్ వరకూ భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,987 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి 26,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చింది.
