ఈ ఆలయాలకు వెళ్లాలంటే డ్రెస్ కోడ్ తప్పనిసరి..

భారతదేశంలో దేవాలయాలకు కొదువేం లేదు. వాటిలో చాలా విశిష్టత కలిగిన ఆలయాలు కూడా ఉన్నాయి. దేశంలోని కొన్ని ఆలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాల్లో సంప్రదాయాలకు పెద్ద పీట వేయకుండా ఉంటారా? తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పెడతారు. ఈ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకోవాలంటే ఆ డ్రెస్ కోడ్‌ని అనుసరించాల్సి ఉంది. డ్రస్ కోడ్ వర్తించే భారతదేశంలోని ప్రముఖ ఆలయాలేంటో తెలుసుకుందాం. ముందుగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని కలియుగ వైకుంఠ క్షేత్రంగా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీవారిని దర్శించుకోవాలంటే డ్రెస్ కోడ్ తప్పని సరి. పురుషులకు షార్ట్‌లు, టీ షర్ట్లు నిషేధం. స్త్రీలు చీర లేదా డ్రెస్ ధరించాలి.

కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలోనూ డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఈ ఆలయంలో పురుషులు సంప్రదాయ లుంగీలు, స్త్రీలు చీర లేదా పంజాబీ డ్రెస్ చుడిదార్‌లు ధరించి దేవుడి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. కర్ణాటకలోని మహాబలేశ్వర దేవాలయంలో సైతం డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈ ఆలయంలోకి భక్తులు జీన్స్, ప్యాంటు, పైజామా, టోపీ, కోటు, బెర్ముడా ఇలాంటివి ధరించడం నిషేధం. ఆలయంలో శివుని దర్శనం చేసుకోవాలంటే పురుషులు ధోతీ .. స్త్రీలు చీర లేదా సూట్ ధరించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని సంభాజీ నగర్‌లోని దౌల్తాబాద్ ప్రాంతంలో ఉన్న ఘృష్ణేశ్వర మహాదేవ ఆలయంలోనూ డ్రెస్ కోడ్ ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన దీనికి పురుషులు షర్ట్, బెల్టు, పర్సు వంటి వాటితో వెళ్లకూడదు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే శివుడిని దర్శించుకోవాలి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలోనూ స్వామివారి జలాభిషేకానికి పురుషులు ధోతీ కుర్తా, స్త్రీలు చీర ధరించాల్సి ఉంది.

Share this post with your friends