ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం

హైదరాబాద్‌కు చెందిన అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున శ్రీ వివేక్ కైలాస్, శ్రీ విక్రమ్ కైలాస్, ఆయన కుటుంబ సభ్యులు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని దాతలు శుక్రవారం తిరుమలలోని ఈవో బంగ్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు. తిరుమలలో వేసవి కాలం సెలవుల కారణంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా భక్తులను కొందరు దారుణంగా మోసగిస్తున్నారు. కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి.. క్యూలైన్లు రోడ్ల వరకూ విస్తరించాయి. దీంతో కొందరు భక్తులు దర్శన టికెట్ల కోసం దళారుల్ని ఆశ్రయించి మోసపోతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు దళారులను నమ్మి మోసపోయారు. మోహన్‌రాజ్‌ కృష్ణస్వామి అనే వ్యక్తి వీఐపీ బ్రేక్‌ టికెట్ల కోసం.. తిరుమలలోని బాలాజీనగర్‌కు చెందిన రాజశేఖర్‌ అనే దళారీని సంప్రదించాడు. అతడితో పాటు టీటీడీ బోర్డులోని ఓ సభ్యుడి పీఆర్వోగా ఉన్న వ్యక్తిని సంప్రదించి వారికి రూ.28 వేలు కట్టి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకున్నాడు. ఒక్కో టికెట్ కోసం రూ.3,500 చెల్లించాడు. క్యూలైన్‌లోకి వెళ్లాక కానీ తాను మోసపోయానని తెలియలేదు. రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Share this post with your friends