వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకొంటాం. ఆ లెక్కన ఇవాళే అక్షయ తృతీయ. ఇవాళ ఏ పని చేసినా అంటే అది మంచైనా చెడైనా అక్షయ ఫలం లభిస్తుందట. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఈ అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడని మత్స్య పుపరాణం చెబుతోంది. విష్ణుమూర్తిని అక్షయుడిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ విష్ణుమూర్తిని పూజించుకుంటే ఫలితం చాలా బాగుంటుందని అంటారు. కొన్ని ఆలయాల్లో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక అక్షయ తృతీయకు సంబంధించిన వ్రతం ఏంటి? ఎలా చేస్తే సంపూర్ణ వ్రత ఫలం దక్కుతుందో తెలుసుకుందాం.
వ్రతం కోసం ముందుగా అక్షితలను తయారు చేసుకోవాలి. ఏ మాత్రం విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యాన్ని అక్షింతల కోసం ఉపయోగించాలి. అక్షితలను తయారు చేసుకున్న అనంతరం వాటిని శ్రీ మహా విష్ణువు పాదాలపై ఉంచి అర్చన చేయాలి. ఆ తరువాత ఆ బియ్యాన్ని చక్కగా మరోసారి ఏరి అందులో కొంత భాగం బ్రాహ్మణులకు దానమివ్వాలి. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా భావించాలి. వాటితో ప్రసాదం చేసుకుని భక్తితో భోజనం చేసిన వారికి అక్షయ తృతీయ వ్రతం చేసిన ఫలం తప్పక సంపూర్ణంగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.