కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ ఆలయంలోనే ఉపాలయంగా ఉన్న వరాహ స్వామి గురించి అందరికీ తెలిసిందే. అయితే మరికొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. శ్రీ వేంకటేశ్వరస్వామి పరమపవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలసి భక్తులను రక్షిస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే శ్రీ వేంకటేశ్వరుడు ఈ క్షేత్రంలో ఉండటానికి పూర్వమే శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహరూపంతో అవతరించాడు.
హిరణ్యాక్షుణ్ణి శ్రీమహావిష్ణువు వరాహావతారంలో సంహరించిన తర్వాత సాధుసంరక్షణ చేయడానికి భూలోకంలోనే ఉండటానికి అంగీకరించి వేంకటాచలం మీద తన నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పటి నుండి ”ఆదివరాహక్షేత్రంగా” తిరుమల పిలువబడుచున్నది. అందువల్ల మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామికి నివేదన చేసిన తరువాతే శ్రీ వేంకటేశ్వర స్వామికి నివేదిస్తారు. భక్తులు సైతం సాధారణంగా ఈ క్షేత్రంలో మొదట వరాహస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాతే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారు.