కోటప్పకొండపై శివుడు ధ్యానంలో ఉండగా శాలంకయ్య అనే రైతు చూశాడని చెప్పుకున్నాం కదా. ఆ రైతుకు శివుడు బాలయోగిలా, దక్షిణామూర్తి స్వరూపంలో కనిపించాడట. దీంతో శివుడిని తన ఇంటికి ఆతిథ్యాన్ని పిలవడం.. ఈ క్రమంలోనే గొల్లభామ తాను గర్బిణిగా ఉన్నందున రాలేనని కిందకు ఆహ్వానించడం.. శివుడు శివలింగంగానూ.. గొల్లభామ శిలగానూ మారిపోయిందని తెలుసుకున్నాం కదా. శాలంకయ్య ఎంత ఎదురు చూసినా శివుడు రాకపోవడంతో కొండ మీదకు వచ్చాడట. అప్పుడు శివుడు శివలింగంగా మారిన దృశ్యం కనిపించిందట.
ఆ దృశ్యాన్ని చూడగానే శాలంకయ్య తీవ్ర ఆవేదనకు గురై విలపిస్తున్నాడట. అప్పుడు శివలింగం నుంచి ఆశ్చర్యకరంగా ‘ఈ కొండ కిందకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో, అప్పుడు నేను కొండ దిగి వస్తాను’ అని చెప్పాడట. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేయాడట. ఆ తరువాత దాని గురించి ప్రజలకు వివరించి, అందరిని ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరకు రమ్మని వేడుకున్నాడట. అప్పటి నుంచి భక్తులు ప్రభలు కట్టుకుని స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నారు కానీ కోటి ప్రభలు మాత్రం పూర్తి కాలేదు. స్వామి కొండ దిగి కిందకూ రాలేదు.