
ఇంతవరకూ మనం చదువుకున్నది కెప్లర్, కోపర్నికస్, గెలీలియోలు అని, వీరంతా 16, 17 శతాబ్దాలకు చెందిన వారు. మరి మన ప్రాచీన భారతీయులకు ‘భూమి గోళము’ అని తెలియదా? అంటే ఎందుకు తెలియదు? వేదకాలం నుంచే ఈ విషయం భారతీయులకు తెలుసు. ఋగ్వేదంలో 1.33.8 మంత్రంలో ఇలా ఉంది.
“చక్రాణాసః పరీణహం పృథివ్యా॥
– భూమి యొక్క వృత్తపు అంచున ఉన్న వారు అని. భావం
‘సూర్య సిద్ధాంతం’ అనే అతి ప్రాచీన గ్రంథంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో –
“మధ్యే సమన్హాదణ్ణస్య భూగోలో వ్యోమ్ని తిష్ఠతి||”
బ్రహ్మాండం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచి ఉన్నది అని అర్ధం. క్రీ.శ. 476 ప్రాంతానికి చెందిన ఆర్యభట్టు.. ‘‘భూగోలః సర్వతో వృత్తః” అని ఆర్యభట్టీయం అనే గ్రంథంలో గోళపాద అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పాడు. అంటే భూమి వృత్తాకారంలో అన్ని వైపులా ఉన్నదని అర్థం. అంతేకాకుండా భూవ్యాసాన్ని చాలా చక్కటి ఉపమానంతో వర్ణించాడు. తద్వారా భూవ్యాసాన్ని గుర్తించాడు. ‘పంచ సిద్ధాంతిక’ అనే గ్రంథంలో వరాహమిహురుడు క్రీ.శ. 505లో పంచ భూతాత్మికమైన గుండ్రని భూమి, పంజరంలో వేలాడే ఇనుప బంతిలాగా… ఖగోళంలో తారల మధ్య నిలిచి ఉంది అన్నాడు. లీలావతి అడిగిన ప్రశ్నకు- భాస్కరాచార్యుడు అనే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు “నీవు చూసేదంతా నిజం కాదు. భూమి ‘చదరంగా’ లేదు. ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళ రేఖలాగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది ఒక వృత్తమే. అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది అని ఆమెకు వివరించాడు.
