అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని.. ఆర్థికంగా చాలా బాగుంటుందని నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనుగోలు మాత్రమే కాదని అంతకు మించిన ధార్మిక విలువ ఉందని పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు కొన్ని ప్రముఖ ఆలయాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. అవేంటో చూద్దాం.
సింహాచలం: సింహాచలంలోని అప్పన్న స్వామివారు ఉగ్రస్వరూపుడై ఉంటారు. ఆయనను శాంతింపజేయడానికి నిత్యం చందన లేపనం చేస్తారు. అయితే ఈ చందనాన్ని అక్షయ తృతీయ నాడు మాత్రం స్వామివారి మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ ఒక్క రోజు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది.
బదరీనాథ్: బద్రీనాథ్‌లో ఆలయాన్ని చలికాలంలో మూసేస్తారు. ఆరు నెలల అనంతరం బదరీనాథుని ఆలయం తెరుస్తారు. ఈ ఆరు నెలల కాలం పాటు ఆలయంలోని అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని అక్షయ తృతీయకు సమీపంలోనే తెరుస్తారు. అలాగే గంగోత్రి, యమునోత్రి ఆలయాలైతే అక్షయ తృతీయ నాడే తిరిగి తెరుస్తారు.
బృందావనం: బృందావనంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటైన ‘బంకే బిహారి’లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి మూలవిరాట్టుగా ఉన్న గోపాలుని పాదాలని దర్శించే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది.
పూరీ: పూరీ జగన్నాథుని రథయాత్రను దేశమంతా ఆసక్తిగా చూస్తుంది. అలాంటి రథయాత్ర కోసం దుంగలకి పూజ చేసి రథ నిర్మాణాన్ని ఆరంభించారు.
కుంభకోణం: తమిళనాడులోని కుంభకోణంలో అక్షయ తృతీయ రోజున 12 వైష్ణవాలయాలలోని ఉత్సవమూర్తులను గరుడవాహనంపై ఊరేగిస్తారు. ఈ ఊరేగింపును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.