
త్రిమూర్తుల గురించి మనకు తెలిసిందే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా చెప్పుకుంటాం. అయితే ఈ ముగ్గురిలో చిన్నవాడు ఎవరనేది చాలా తక్కువ మందికి తెలుసు. బ్రహ్మ అందరికంటే చిన్నవాడు. అయినా సరే.. ఏ చిత్రపటం చూసినా కూడా మిగిలిన ఇద్దరి కంటే బ్రహ్మదేవుడు వృద్ధుడిగా కనిపిస్తాడు. దీనికి కారణం ఏమిటన్న సందేహం కొందరికి కలుగక మానదు. అది మాత్రమే కాదు.. మిగిలిన ఇద్దరికీ ఎక్కడ పడితే అక్కడ ఆలయాలు మనకు కనిపిస్తాయి కానీ బ్రహ్మదేవుడికి మాత్రం ఆలయం మనకు ఎక్కడా కనిపించదు. దానికి కారణాలేంటో తర్వాత తెలుసుకుందాం.
ముందుగా బ్రహ్మ కారణంగా ఏర్పడిన సరస్సుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ గురించి పద్మపురాణంలో వివరించడం జరిగింది. దాని ప్రకారం పూర్వం వజ్ర నాభుడనే రాక్షసుడి కారణంగా ప్రజలు, ఇంద్రాది దేవతలంతా ఇబ్బంది పడేవారు. ఈ విషయమై దేవతలంతా బ్రహ్మకు మొరపెట్టుకోగా తన చేతిలోని తామరపువ్వునే ఆయుధంగా మలిచి ఆ రాక్షసుడిని సంహరించాడు. ఈ సమయంలో తామర పువ్వు నుంచి రేకులు నేలపై రాలి అవి కాస్తా మూడు సరస్సులుగా మారాయట. ఆ సరస్సులు మరేవో కాదు.. జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్. బ్రహ్మ చేతి పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అనే పేరు వచ్చిందని పద్మపురాణం చెబుతోంది.
