హిందువులు తులసి చెట్టును చాలా పవిత్రంగానూ లక్ష్మీదేవి స్వరూపంగానూ చూస్తూ ఉంటారు. ప్రతి రోజూ ఉదయాన్నే పూజ చేస్తుంటారు. ఇక జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉంటాం. అది దసరా రోజున. దీనిని శమి పూజ అని కూడా అంటాం. ఇక ఉసిరి చెట్టు కార్తీక, అశ్వనీ మాసంలో పూజించుకుంటూ ఉంటాం. ఇలా మనం ఎన్నో చెట్లను ఆరాధిస్తూ ఉంటాం. అసలు ఎందుకిలా ఆరాధిస్తాం అంటే ఒక్కో చెట్టులో ఒక్కో దేవత కొలువై ఉందని నమ్మకం. మరి ఏ ఏ చెట్టులో ఏఏ దేవత కొలువై ఉందో చూద్దామా? ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. మారేడు చెట్టులో శివుడు కొలువై ఉంటాడట.
అందుకే శివుడిని మారేడు దళాలతో పూజించుకుంటూ ఉంటాం. మారేడులో ఔషధ గుణాలతో పాటు దాని కలప కూడా చాలా విలువైనది. అరటి చెట్టులో శ్రీ మహా విష్ణువు నివసిస్తాడట. ఈ చెట్టును ప్రత్యేకంగా గురువారం పూజిస్తూ ఉంటారు. దీపావళి పూజలోనూ… సత్యనారాయణ స్వామి వ్రతంలోనూ అరటి చెట్టును వినియోగిస్తూ ఉంటాం. ఇక వేప చెట్టులో దుర్గమ్మ కొలువై ఉంటుందట. తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటు మహా విష్ణువు, శాలిగ్రామ్ స్వామి ఉంటారట. ఇక రావి చెట్టులో శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడని నమ్మకం. అంతేకాకుండా రావి చెట్టు ఆకుల్లో సకల దేవతలూ కొలువై ఉంటారని చెబుతుంటారు.