దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలున్నాయి. వాటిలో వైష్ణో దేవి ఆలయం, కేదార్‌నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయం, స్వర్ణ దేవాలయం, కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్య రామాలయం, తిరుమల శ్రీవారి ఆలయం వంటి అనేక దేవాలయాలు దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో చేర్చబడ్డాయి. ఈ ఆలయాలకు జాతీయంగానే కాదు.. అంతర్జాతీయ ఖ్యాతిని కూడా సొంతం చేసుకున్నాయి. అయితే దేశంలో రాక్షసులకు సైతం ఆలయాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
హిడింబా దేవి ఆలయం: పాండవుల మధ్యముడు అయిన భీముడి భార్య హిడింబా దేవి. రాక్షస జాతికి చెందిన ఈమెకు కూడా దేశంలో ఓ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వెలసిన హిడింబ దేవిని వనదేవతగా, ప్రకృతి దేవతగా భావించి పూజిస్తారు. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఉంది. ఇక్కడ హిడింబి దేవి లేదా హిర్మా దేవి కొలువై ఉంటుంది. ఈ ఆలయం మహాభారత కాలానికి చెందినదని పేర్కొంటారు.ఈ ఆలయంలో రాక్షసిని పూజిస్తే కోరుకున్న వారితో వివాహం జరుగుతుందని చెబుతారు. మనాలిని సందర్శించడానికి వెళ్ళే పర్యాటకులు ఖచ్చితంగా హిడింబా దేవిని దర్శించుకునే వస్తారు.
గిద్ధేశ్వర్ ఆలయం: రాక్షస గుణం వ్యక్తులకు ఆలయాలు మాత్రమే కాకుండా.. మన దేశంలో జటాయువు వంటి పక్షికి కూడా ఆలయం ఉంది. జటాయువు రామాయణ కాలంనాటిదని తెలిసిందే. ఈ ఆలయం కూడా రామాయణ కాలంతో ముడిపడి ఉంది. బీహార్‌లోని జాముయి జిల్లాలో ఉన్న గిద్దీశ్వర్‌లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. పురాణాల ప్రకారం గిద్దీశ్వర ఆలయానికి రాబందు, దేవుడు అనే పదాలు కలిపి గిద్ధేశ్వర్ అని పేరు పెట్టారు. ఈ గిద్దేశ్వర్ ఆలయాన్ని సందర్శించి జటాయువుని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. అయితే ఈ ఆలయాన్ని జటాయువు అని కాకుండా శివాలయం అని పిలుస్తారు. ఇతిహాసాల ప్రకారం, రావణుడు, జటాయువు మధ్య యుద్ధం ఈ ప్రదేశంలోనే జరిగిందని నమ్మకం.