భూమాతలో సీతాదేవి ఐక్యమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసా?

సీతమ్మను శ్రీరాముడు అడవిలో విడిచి పెట్టమనడంతో లక్ష్మణుడు విడిచి పెట్టి వచ్చాడు. ఆ తరువాత సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో చేరింది. ఈ కథ గురించి తెలిసిందే. ఆ తరువాత లవకుశలను తండ్రి శ్రీరాముడి చెంతకు చేర్చి భూదేవిలో సీతమ్మ ఐక్యమైంది. ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? భూదేవిలో సీతమ్మ ఐక్యమైన ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, అలహాబాద్‌లను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కి.మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ‘సీత సమాహిత్ స్థల్’ లేదా ‘సీత మారి’ అని పిలుస్తారు. తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఒక గుడి ఉంటుంది. దీనిని సీతాదేవి స్మారకం అని అంటారు.

ఈ అందమైన సీతాదేవి స్మారక కట్టడాన్ని 90వ దశకంలో నిర్మించారు. అసలు ఈ కట్టడాన్ని నిర్మించక ముందు అక్కడ ఏం ఉందో తెలుసా? ఇక్కడ అమ్మవారి జుట్టుని తలపించే విధంగా కేశ వాటిక ఉండేదట. ఈ ప్రాంతంలో అప్పట్లో గడ్డి మొలిచేదట. ఆ గడ్డిని ఎందుకో కానీ పశువులు తినేవి కావట. ఆ తరువాత సీతా కేశ వాటికను అలాగే ఉంచి ఇక్కడ స్మారకాన్ని నిర్మించారు. ఈ స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం కూడా ఉండటం విశేషం. ఇక్కడే సీతాదేవి ఆశ్రయం పొందిందని చెబుతారు. అలాగే ఇక్కడ ఉన్న సీత వటవృక్షం దగ్గరే లవకుశలకు జన్మనిచ్చిందని స్థానికులు చెబుతారు.

Share this post with your friends