సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

కొత్త సంవత్సరంలో మనకు మొదట వచ్చే పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగకు ముందు భోగి పండుగను జరుపుకుంటాం. 13న భోగి, 14న మకర సంక్రాంతి జరుపుకుంటాం. మూడవ రోజున కనుమ పండుగను జరుపుకుంటూ ఉంటాం. హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంవత్సరంలో అతిపెద్ద పండుగలలో ఒకటిగా పరిగణించబడుతోంది. సూర్యుడు తన రాశిని మార్చుకుని మకర రాశిలో అడుగు పెట్టడమే మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి పండుగను తెలుగువారు మాత్రమే కాకుండా ఉత్తరాదివారు కూడా విభిన్న పేర్లతో జరుపుకుంటారు. ఈ పండుగతోనే ఉత్తరాయణ కాలం మొదలవుతుంది.

మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటామనేది అందరికీ తెలిసిందే. మరి గుజరాత్, రాజస్థాన్‌లలో ఎలా జరుపుకుంటారో తెలుసా? ఇక్కడ తెలంగాణ మాదిరిగానే గాలిపటాలు ఎగురవేస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లో దీనిని ఉత్తరాయణం అంటారు. ఇక్కడే సంక్రాంతి సమయంలో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దీనికోసం దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం కైట్స్ ఎగురవేయడానికి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఆ రోజున ఆకాశమంతా రంగురంగుల గాలి పటాలతో అందంగా కనిపిస్తుంది. మరోవైపు రైతులు సైతం పంట చేతికి రావడంతో ఆనందంగా దీనిని జరుపుకుంటారు.

Share this post with your friends