శివలింగ ఆరాధన ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

శివలింగ ఆరాధన ఎక్కడి నుంచి ప్రారంభమైనదనేది వాస్తవానికి అత్యంత ఆసక్తికరం. దాని గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్మోరా జిల్లాలో చారిత్రక ఆలయాలకు కొదువ ఉండదు. అలాంటి ఆలయాల్లో ఒకటి జగేశ్వర్ ధామ్. లింగరూపంలో శివుడిని ఆరాధించే సంప్రదాయం భూమిపై ఇక్కడి నుంచే ప్రారంభమైందట. ఈ ఆలయానికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. శివుడు ఈ క్షేత్రంలోనే తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడి శివలింగాన్ని ఎనిమిదవ జ్యోతిర్లింగంగానూ.. యోగేశ్వర అనే పేరుతో పిలుస్తారు. పురాణాలలో సైతం ఈ ప్రదేశ ప్రస్తావన ఉంది. ఈ జగేశ్వర్ ధామ్‌లో మొత్తంగా 124 దేవాలయాలు ఉన్నాయి.

అన్ని దేవాలయాల్లో పార్వతి, హనుమంతుడు, మృత్యుంజయ మహాదేవుడు, భైరవ, దుర్గ వంటి అనేక రూపాల్లో భగవంతుడు కొలువై న్నాడు. ఇక్కడ సప్త రుషులు సైతం తపస్సు చేసేవారని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయానికి 5 కిలో మీటర్ల దూరంలో శివుని పాదముద్రలు ఉన్నాయట. ఈ పాద ముద్రల గురించి కూడా ఒక కథ ఉంది. శివుడిని వెదికేందుకు ఒకసారి పాండవులు వచ్చారట. వారికి కనిపించకుండా ఉండేందుకు పరమేశ్వరుడు తన ఒక పాదాన్ని జగేశ్వర ఆలయానికి 5 కిలో మీటర్ల దూరంలోనూ.. మరో కాలి ముద్రను కైలాసంపై ఉంచాడని చెబుతారు.

Share this post with your friends