హిందూ ధర్మం హనుమంతుడిని బాల బ్రహ్మచారి అని.. ఆజన్మ బ్రహ్మచారి అని చెబుతోంది. వివాహమైనప్పటికీ పవన సుతుడు బ్రహ్మచారిగానే ఉండిపోయిన విషయం తెలిసిందే. సూర్యుని కుమార్తె సువర్చలను హనుమంతుడు వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం సువర్చల తపస్సులోకి వెళ్లిపోవడంతో హనుమంతుడు వివాహమైనా కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. అమరత్వం పొందిన సప్త రుషుల్లో హనుమంతుడిని కూడా ఒకడిగా చెబుతుంటారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే హనుమంతుడిని వివాహితుడిగానే పరిగణిస్తూ ఉంటారు.
మరి హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో కలిసి ఉన్న ఆలయాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. అది ఎక్కడో కాదు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 220 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లాలోని యల్నాడు అనే ప్రాంతంలో స్వామివారు తన భార్య సతీమణితో కలిసి దర్శనమిస్తారు. ఇది ఈనాటి ఆలయం కాదు.. పురాతన దేవాలయం. ఈ ఆలయాన్ని ఎవరైతే సందర్శించి భక్తితో పూజలు చేస్తారో వారికి వైవాహిక సమస్యలన్నీ వైదొలుగుతాయని నమ్మకం.