శివయ్యకు బిల్వ పత్రం అంటే అత్యంత ఇష్టమని మనం వాటితో పూజ చేస్తూ ఉంటాం. ఈ బిల్వ పత్రాలనే మారేడు దళాలని కూడా అంటారు. అసలు ఈ బిల్వ పత్రాల ప్రాముఖ్యత ఏంటో తెలుసకుందాం. మనం మహా శివుడిని బిల్వ పత్రాలతో పూజించే సమయంలో “త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం” అంటూ పూజిస్తాం. బిల్వపత్రం మూడు ఆకులుంటాయి. వాటిలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో పరమేశ్వరుడు కొలువై ఉంటారట. అందుకే బిల్వ పత్రానికి అంతటి ప్రాధాన్యత. ప్రతి శివాలయంలో తప్పక ఓ బిల్వ వృక్షం ఉంటుంది.
వ్యాస మహర్షి రచించిన శివపురాణంలో సైతం ఈ బిల్వ పత్రం గురించి ప్రస్తావించడం జరిగింది. కార్తీక మాసంలో బిల్వ దళాలతో అర్చిస్తే మూడు జన్మల్లో మనం చేసిన పాపాల తాలుకు దోషాలన్నీ తొలగిపోతాయట. కాబట్టి మన పాపాలను తొలగించుకోవాలంటే తప్పక బిల్వ దళాలతో శివారాధన చేయాలట. సాధారణంగా వృక్షాలకు మొదటగా పువ్వులు పూస్తాయి. ఆ తరువాత అవి కాస్తా కాయగా మారుతుంది. కానీ బిల్వ వృక్షానికి మాత్రం తొలుత కాయగానే కనిపిస్తుంది. కాడ లేని పుష్పాలు, కాయలు, ఆకులు మాత్రమే హిందూ సంప్రదాయంలో పూజకు వినియోగిస్తూ ఉంటారు. బిల్వ పత్రాలను మాత్రం కాడతోనే సేకరించి శివుడి ఆరాధనకు వినియోగిస్తాం. అలా చేస్తేనే శుభ ఫలితాలు దక్కుతాయని శివపురాణం చెబుతోంది.