నగరాలన్నీ నదీ ఒడ్డునే వెలిశాయంటారు. కానీ అక్కడ కావేరి నది ఒడ్డునున్న ఊరు మాత్రం ఎడారిని తలపిస్తూ ఉంటుంది. ఈ ఊరికి కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ ప్రముఖ ఆలయం కూడా ఉంది. కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ‘తలకాడు’ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయంలోని శివుడిని వైద్యనాథుడు అని పిలుస్తారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే.. ఒకప్పుడు సోమదత్తుడు అనే రుషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తూ గంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా, వారిని అడవి ఏనుగలు చంపేశాయట. శివభక్తులైన వారంతా మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి శివుడిని ఆరాధిస్తూ ఉండేవారు. ఒక బూరుగు చెట్టునే శివుడిగా భావించి పూజలు చేసేవారు. ఒకసారి ఆ ప్రాంతానికి తల, కాడు అనే ఇద్దరు కిరాతకులు వచ్చి ఆ బూరుగు చెట్టును నరుకుతుండగా దాని నుంచి రక్తం కారింది.
అప్పుడు తాను పరమేశ్వరుడినని.. తనను పూజిస్తున్న సోమదత్తుడు, అతని శిష్యుల కోసం బూరుగు చెట్టులో నివసిస్తున్నానని ఆకాశవాణి చెబుతుంది. ఆ వెంటనే సోమదత్తుడు, అతని శిష్యులతో పాటు తల, కాడు కైవల్యాన్ని పొందుతారు. తన గాయాన్ని తనే నయం చేసుకున్నాడు కాబట్టి శివయ్య.. వైద్యనాథుడిగా పూజలు అందుకుంటున్నాడు. అనంతరం ఆ ప్రదేశానికి తలకాడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత అక్కడ వైద్యనాథుడికి ఆలయాన్ని సైతం నిర్మించారు. ఇది కాకుండా పాతాళేశ్వర, అర్కేశ్వర, మరులేవ్వర, మల్లికార్జున అనే పేర్లతో మొత్తంగా ఇక్కడ అయిదు శివాలయాలున్నాయి. వీటిని పంచలింగాలని పిలుస్తారు. వీటితో పాటుగా మరో పాతిక ఆలయాలు ఈ తలకాడులో ఉన్నాయి. అయితే అవన్నీ చాలా వరకూ ఇసుక దిబ్బల కింద కూరుకుకపోయాయి. కేవలం వైద్యనాణథ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాల్లోకి మాత్రమే ప్రవేశించగలం.