ప్రతిరోజూ శ్రీవారికి సుప్రభాత సేవకు ముందు జరిగే తంతు ఏంటో తెలుసా?

ప్రతి రోజూ బ్రాహ్మ ముహూర్తంలో అంటే.. 2.30 నుంచి 3.00 గంటల మధ్యలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఈ సేవకు ముందు జరిగే తంతు గురించి దాదాపు ఎవరికీ పెద్దగా తెలియదు. స్వామివారి సుప్రభాత సేవకు ముందు ‘సన్నిథిగొల్ల’ దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వెళ్లి శ్రీవారి ఆలయానికి విచ్చేయమని స్వాగతిస్తారు. అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ‘కుంచెకోల’ ను, తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిథిగొల్లతో కలిసి మహాద్వారం వద్దకు చేరుకుంటారు. వీరు మహాద్వారం వద్దకు చేరుకోగానే ‘నగారా’ మండపంలోని నౌబత్ ఖానాని మోగిస్తారు. దీనిని మోగించిన తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు.

ముఖద్వారాన్ని తెరిచిన అనంతరం సన్నిథిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూనే ఆలయం లోపలికి ప్రవేశిస్తారు.
అనంతరం తమ వద్ద ఉన్న ‘కుంచెకోల’ను, తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి.. ఆపై క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కస్తారు. ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. సన్నిథిగొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు. అక్కడ సిద్ధంగా ఉన్న జియ్యంగార్‌ను కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా సిద్ధంగా ఉన్న వారిని తీసుకుని సన్నిధి గొల్ల ఆలయానికి వెళతారు.

వీరు వెళ్లే సమయానికే ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులంతా బంగారు వాకిలి ముందు సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో తాళ్ళపాక అన్నమయ్య వంశం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సైతం సిద్ధంగా ఉంటారు. అనంతరం బంగారు వాకిలి గడియకు తాళాన్ని తీస్తారు. అనంతరం సుప్రభాత సేవ కోసం బుక్ చేసుకున్న భక్తులను బంగారు వాకిలి వద్దకు అనుమతించి సీలు వేసిన మూడు పెద్ద తాళాలను భక్తులకు చూపించి తెరుస్తారు. తాళం తీయగానే సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో “కౌసల్యా సుప్రజా రామా …” అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు. ఇది ప్రతిరోజు సుప్రభాత సేవకు ముందు జరిగే తంతు.

Share this post with your friends