శ్రీకృష్ణుడు.. సత్యభామా సమేతుడై నరక సంహారం గావించాడని చెబుతున్న నడకుదురులో మరో విశేషం కూడా ఉంది. కన్నయ్య దేవ వనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి నాటాడని చెప్పుకున్నాం కదా.. వాస్తవానికి దేశంలో పాటలీ వృక్షాలు చాలా అరుదు. కాశీ సహా పలు ప్రాంతాల్లో ఇవి అంతరించే స్థితిలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాటలీ వృక్షాలను వేరొక చోట ఎక్కడ నాటినా కూడా అవి పెరగలేదు. మరి మట్టి కారణమో.. వాతావరణం కారణంగానో తెలియదు. కానీ నడకుదురు ప్రాంతంలో ఇప్పటికీ పాటలీ వృక్షాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.
కార్తీక మాసమంతా ఈ పాటలీ పుష్పాలతోనే పృథ్వీశ్వర స్వామికి భక్తులు పూజలు చేస్తుంటారు. కార్తీకమాసమంతా మనం శివుడిని ఆరాధిస్తూ ఉంటాం. నడకుదరులో శివుని రూపమైన పృథ్వీశ్వరుని పూజిస్తారు. ఆలయం దగ్గరలోనే ఉన్న కార్తిక వనం ఉంటుందని చెప్పుకున్నాం కదా.. ఇక్కడ వందలాదిగా ఉన్న ఉసిరి చెట్లు వేలాది మందికి ఆతిథ్యాన్నిస్తాయి. అంతేకాకుండా కార్తీకంలో ఇక్కడి వనాల్లో సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇక్కడి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అరుదైన ఉసిరి, పాటలీ వృక్షాలతో కూడిన వనంలో కార్తీక మాసంలో వన భోజనాలు చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనం వస్తుంటారు.