కన్నయ్యకు నీడలా మారిన రెండు పక్షుల కథ తెలుసా?

నందుడి వాళ్ళ ఇంట్లో చాలా పాత బాదంచెట్టు దొడ్లో చిట్ట చివర ఉండేది. ఆ చెట్టుకాండం చాలా పొడుగ్గా, లావుగా ఉండేది. అది చాలా ఎత్తు పెరిగటం వల్లనూ, చెట్టు కొమ్మలు బాగా విస్తరించుకోవటం వల్లనూ, ఆ చెట్టు నీడ దొడ్లో చాలాభాగం పరుచుకుని ఉండేది. ఆ పెద్ద చెట్టు మీద చిన్నా, పెద్దా పక్షులు చాలా నివాసం ఉండేవి. కృష్ణుడు పుట్టడానికి కొద్ది సంవత్సరాల ముందు ఆ బాదం చెట్టు మీద ఉన్న గూడులో ఉన్న కృష్ణపక్షి రెండు గుడ్లు పెట్టింది. వాటి నించి రెండు చిన్ని కృష్ణ పక్షులు పుట్టాయి. వాటి పేర్లు యాస్కుడు, శబరుడు. అవి రెండూ త్వరలో పెద్దవై హాయిగా అటూఇటూ తిరుగటం మొదలెట్టాయి. వాటి రెక్కలు కూడా పెద్దవి అయ్యాయి.

కొన్ని రోజులకి కృష్ణుడు పుట్టాడు. యశోద ప్రేమతో కృష్ణా అని పిలిస్తే బాదం చెట్టు మీద నించీ పక్షులు రెండూ ‘కృష్ణా, కృష్ణా’ అంటూ అరిచేవి. వాటికి ప్రతిగా కృష్ణుడు గట్టిగా ‘కృష్ణా, కృష్ణా’ అంటూ అరిచేవాడు. ఆ పక్షులు మళ్ళీ అరిచేవి. అలా పొద్దున మొత్తం గడిచేది. పొద్దెక్కి ఎండ కాస్త చుర్రు మనటం మొదలెట్టగానే ఆ పక్షుల్లో పెద్దదో, చిన్నదో వొచ్చి ఆచురుక్కుమనే ఎండ కృష్ణుడి మీద పడకుండా, ఓ గొడుగు లాగా, ఆకాశంలో అలా రెక్కలు కదిలిస్తూ స్థిరంగా నిలబడేది. కాసేపు అలా ఉన్న తరవాత, ఓపిక అయిపోతే, ఒక అరుపు అరిస్తే రెండో పక్షి వొచ్చి ఎండ పడకుండా నిలబడితే మొదటి పక్షి వెళ్ళి విశ్రాంతి తీసుకునేది. ఇలా కృష్ణుడు ఇంటి బయట ఆడుతున్నంత సేపూ ఆ రెండు పక్షులూ, ఒకటి తరవాత ఒకటి వొచ్చి కృష్ణుడి మీద ఎండ పడకుండా చూసేవి. అలాగే వర్షాకాలంలో కూడా కృష్ణుడు తడవకుండా నిలబడేవి.

Share this post with your friends