భృగు మహర్షికి చెందిన ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన కథ ఉంది. అంత ఆసక్తికర కథ ఏంటంటే.. పురుషునికి పిల్లవాడు జన్మించిన కథ. అదేంటో తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన యవనాశ్వుడు అనే మహారాజు నూరు అశ్వమేధ యాగాలు చేసి కీర్తి ప్రతిష్ఠలు, పుణ్య ఫలం సంపాదించాడు. ఆయన ధర్మపాలన చేసిన వాడు. ఆయనకు ఒక్కటే ఒక్క లోటు ఉండేదట. అదే సంతానం లేకపోవడం. ఒకరోజు యశనాశ్వుడు భృగు మహర్షిని ఆశ్రయించి ఆయన సలహా మేరకు పుత్రకామేష్టి యాగం చేశాడట. యాగంలో చివరిగా పుత్రోత్పత్తికి తాగవలసిన మంత్ర జలాన్ని మర్నాడు అతని భార్య చేత తాగించాలని భృగు మహర్షి తెలిపాడు.
సరేనని చెప్పి రాజు ఆ మంత్ర జలాన్ని ఋత్విక్కులకు ఇచ్చి దానిని జాగ్రత్త చేయమని చెప్పి యాగశాల సమీపంలో రాజు నిద్రించాడు. రాత్రి వేళ ఆయనకు దాహం కారణంగా మెలకువ వచ్చిందట. నిద్రకళ్లతో ఉన్న యశనాశ్వుడు భార్య కోసం జాగ్రత్త చేసి మంత్ర జలాన్ని తాగేశాడట. ఆ తరువాత విషయం గ్రహించి వెంటనే భృగు మహర్షికి విషయం చెప్పాడు. ఆ జలం పుత్ర ప్రాప్తి కోసం ఉద్దేశించినది కనుక దానిని తాగిన యవనాశ్వునికి పుత్రుడు కలుగుతాడని ఆయన చెప్పారు. అయితే పుట్టబోయే బిడ్డ మేధావి అవుతాడని వంశాభివృద్ధి చేస్తాడని యశనాశ్వుడిని భృగు మహర్షి ఆశీర్వదించాడు. అలా యశనాశ్వుడికి జన్మించిన వాడే మాంధాత. గొప్ప పుణ్యకార్యాలు చేసి కీర్తి ప్రతిష్టలు గడించి మాంధాత షట్చక్రవర్తులలో ఒకనిగా పేరు పొందాడు.