ఉడిపిలోని కన్నయ్య ప్రత్యేకతేంటో తెలుసా?

శ్రీకృష్ణుడి పుట్టినరోజును మనం జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. కన్నయ్య దక్షిణాయనంలో శ్రావణ మాసం కృష్ణపక్షం అర్థరాత్రి అష్టమి తిథి రోహణి నక్షత్రంలో జన్మించాడు. ఇక ఆయన జన్మించిన మధురలోనూ.. పెరిగిన బృందావనంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో జన్మాష్టమి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ శ్రీ కృష్ణుడికి అద్భుతమైన ఆలయాలున్నాయి. ఉండటమే కాదు.. ప్రతి ఆలయానికి ఓ చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. వాటిలో ఒకటి ఉడిపి శ్రీకృష్ణ మఠం.

కర్ణాటక రాష్ట్రంలో ఉందీ ఉడిపి. శ్రీకృష్ణుడి అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని 13 శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. మధ్వాచార్యులు ఇక్కడ కన్నయ్యను ప్రతిష్టించాడని చెబుతారు. సముద్రం మధ్యలో మునిగిపోతున్న ఓ పడవను మధ్వాచార్యులు ఒడ్డుకు చేర్చారట. ఆ పడవలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఆయన అడిగి తీసుకుని ఉడిపిలో ప్రతిష్టించారని చెబుతారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ విగ్రహాన్ని దేవకి కోరిక మేరకు దేవశిల్పితో రుక్మిణి చెక్కించిందట. ఆ విగ్రహం సముద్రం ద్వారా ఉడిపికి వచ్చి చేరిందని అక్కడి వారి నమ్మకం. ఇక్కడి కన్నయ్యను కిటికీ నుంచి మాత్రమే దర్శించుకోవాలి. ఇక శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ ‘విట్టల్ పిండి’ పేరుతో కన్నయ్య విగ్రహాన్ని తయారు చేస్తారు. దానిని జన్మాష్టమి రోజున ఊరేగించి ఆ తరువాత ఆలయంలోని సరోవరంలో నిమజ్జనం చేస్తారు.

Share this post with your friends