జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఒరిస్సాలోని పూరిలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా రథయాత్ర జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది. ఈ రథయాత్రలో మూడు రథాలు ఉంటాయి. ఒకటి జగన్నాథుడుది.. రెండోది ఆయన సోదరి సుభద్ర, మూడోది బలరాముడు. అసలు ఈ రథయాత్ర ఎందుకు నిర్వహిస్తారు? అంటే దాని వెనుక కథలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. సుభద్రా దేవి నగరాన్ని చూడాలన్న కోరిక మేరకు జగన్నాథుడు, బలరాముడు రథంపై తీసుకెళ్లారట. జగన్నాథుడు తన అత్త గుడించా దేవి ఇంట ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడట. కాబట్టి అప్పటి నుంచి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నారన్నది ఒక కథ.
ఒకరోజు శ్రీకృష్ణుని భార్యలంతా బలరాముని తల్లి రోహిణిని కన్నయ్య రాసలీలల గురించి అడగ్గా ఆ కథలను సుభద్ర వినకూడదని చెప్పడంతో బలరాముడు, కృష్ణఉడు సుభద్రను తీసుకుని రథయాత్రకు వెళ్లారట. దారిలో ఆ దృశ్యాన్ని చూసిన నారదుడు అమితానందుడై ఆ అదృష్టాన్ని భక్తులందరికీ కల్పించాలని కోరగా కన్నయ్య అంగీకరించాడట. అప్పటి నుంచి ప్రతి ఏటా రథయాత్ర జరుగుతోందట. మరో కథ ఏంటంటే.. వేదవ్యాసుడు భక్తులందరికీ దర్శనమివ్వమని కన్నయ్యను కోరాడట. అందుకే కన్నయ్య ప్రతి ఏటా రథయాత్రతో తన భక్తులకు దర్శనం ఇస్తున్నాడట.