బాలుడి రూపంలో శివయ్య తిరుగాడిన ప్రాంతం ఎక్కడుందో తెలుసా?

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిరిచెల్మలో పాత శివాలయం ఒకటి ఉంది. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేతుడై స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఈ గ్రామంలో స్వామివారు ప్రత్యక్షంగా తిరిగాడని స్థానికులు చెబుతుంటారు. స్థలపురాణం ప్రకారం గ్రామంలో పిట్టయ్య, నుమ్మవ్వ దంపతులుండేవారు. వారికి సంతానం లేదు. అయితే ఆ గ్రామానికి పశువుల కాపరిగా వచ్చిన బాలుడికి మల్లన్న అని పేరు పెట్టి పెంచుతారు. మల్లన్న కష్టంలో ఉన్న వారికి సాయం చేసేందుకు ఏమాత్రం వెనుకాడేవాడు కాదట. అందుకే మల్లన్న అంటే అందరికీ ఇష్టమే. ఒకానొక సమయంలో గ్రామంలో తీవ్ర వర్షాభావం కారణంగా నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందట.

మల్లన్న తాను ఒక రోజులో చెరువును తవ్వడమే కాకుండా వర్షాన్ని కూడా కురిపిస్తానని గ్రామ ప్రజలతో చెప్పి చెరువును తవ్వడం ప్రారంభించాడు. అయితే మల్లన్నకు సాయానికి ఎవరూ ముందుకు రాలేదు. అయినా సరే ఒంటరిగానే మల్లన్న చెరువు తవ్వేశాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు వచ్చి చూసి వండర్ అవుతారు. ఈ చెరువు మధ్యలో శివలింగం ఉంటుంది. అయితే ఆ చెరువు తవ్విన బాలుడే శివుడేనని గ్రామస్తులు నమ్ముతున్నారు. చెరువు తవ్విన తర్వాత బాలుడు కనిపించలేదు. అయితే పోతూ పోతూ శివలింగాన్ని ఇక్కడ వదిలాడని అంతా భావిస్తారు. ఆ తరువాత మల్లన్న కలలో కనిపించి తనకు అక్కడ ఓ దేవాలయం నిర్మించాలని సూచించాడట. ఇది మల్లికార్జున దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆలయంలో రెండు నందులు ఉంటాయి. ఈ దేవాలయానికి సమీపంలోనే కుంతల జలపాతం ఉంది.

Share this post with your friends