పూరి జగన్నాథుని కథ గురించి తెలుసా?

పూరి జగన్నాథుని కథ గురించి తెలుసా? పూరిలో విగ్రహాలు సగమే చెక్కి ఉంటాయి. దీని వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో చూద్దాం. ఒకరోజు అత్తి చెట్టు కింద ధర్మరాజుకు ఇంద్రనీల రూపంలో కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు కనిపించాడు. అయితే జగన్నాథుడిని గుర్తించని ధర్మరాజు అదేదో విలువైన రాయి అనుకుని నేల మాళిగలో ఎవరి కంటా పడకుండా దాచేశాడు. ఈ విషయం మహారాజైన ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. ఎలాగైనా దానిని సొంతం చేసుకోవాలని ఆ ప్రాంతం మొత్తం వెదుకుతాడు ఫలితం దక్కదు. దీంతో అక్కడే నిద్రిస్తాడు. అప్పుడు కలలోకి విష్ణుమూర్తి కనిపించి పూరి సముద్ర తీరానికి ఒక కొయ్య దుంగ కొట్టుకు వస్తోందని దానిని దారు శిల్పంగా చెక్కించాలని ఆదేశిస్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు పూరికి బయలుదేరి వెళతాడు.

అక్కడ విష్ణుమూర్తి చెప్పినట్టుగానే కొయ్య దుంగ అలలపై కొట్టుకొస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో విష్ణువు, విశ్వకర్మ ఇద్దరూ వృద్ధశిల్పకళాకారుల వేషంలో అక్కడకు వస్తారు. కొయ్యదుంగనే విగ్రహాలుగా తాము చెక్కుతామని చెబుతారు. కానీ ఒక కండీషన్ పెడతారు. విగ్రహాలు చెక్కేంత వరకూ రాజు వాటివంక కూడా చూడకూడదని.. చూస్తే అర్థాంతరంగా వదిలి వెళ్లిపోతామని చెబుతారు. సరేనని ఇంద్రద్యుమ్నుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతకాలం తర్వాత ఇంద్రద్యుమ్నుడి భార్య గుండిచాదేవి ప్రోద్భలంతో విగ్రహాల పని ఎంతవరకూ వచ్చిందో చూసేందుకు వెళతాడు. దీంతో విష్ణువు, విశ్వకర్మ మాయమవుతారు. విగ్రహాలు సగమే చెక్కి ఉంటాయి. దీంతో కృంగిపోయిన రాజుకు బ్రహ్మది దేవతలు సర్ది చెప్పి వాటిని అలాగే ప్రతిష్టంప జేశారు. ఇదీ పూరి జగన్నాథుని కథ.

Share this post with your friends