మకర సంక్రాంతిని మనం మరి కొన్ని గంటల్లో జరుపుకోనున్నాం. ఇది అత్యంత పెద్ద పండుగ కావడంతో ఏపీకి చెందిన వారు దేశం నలుమూలల నుంచి తమ సొంత రాష్ట్రానికి తరలి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమగా కొన్ని ప్రాంతాల్లో.. ముక్కనుమను సైతం మరికొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఇక్కడ భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో పాత వస్తువులను దహనం చేస్తారు.
ఏపీలో సంక్రాంతి రోజున పెద్దల పండగా భావించి పెద్దలను పూజిస్తారు. ఇంటి ముందు పెద్ద ఎత్తున రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోళ్ల పందేలతో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కనుమ రోజున పశువులను పూజిస్తారు. తెలంగాణలో కూడా మకర సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఇక్కడ గాలిపటాలను ఎగురవేస్తారు. ఇక కేరళలో సంక్రాంతిని మకర విళక్కు అని పిలుస్తారు. కేరళలో విశేషం ఏంటంటే.. మకర విళక్కు నాడు శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకరజ్యోతి కనిపిస్తుంది. ఈ మకర జ్యోతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వెళుతుంటారు.