శ్రావణ మాసం.. అందునా తొలి శుక్రవారం కావడంతో ఆలయాలన్నింటినీ చక్కగా అలంకరించారు. అమ్మవారి ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు నిర్వహిస్తు్న్నారు. విశాఖ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ముత్యాల చీరను అలంకరించారు. అమ్మవారి మూల విరాట్టుకు క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే మహిళలంతా అమ్మవారి ఆలయంలో సామూహిక లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమ పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు.
ఇక శ్రావణ మాసం ప్రత్యేకతేంటో తెలుసా? ఈ మాసంలో వ్రతం లేని రోజంటూ ఉండదు. వారంలో ప్రతి రోజూ.. ప్రతి తిథిని విశేషంగానే పరిగణిస్తూ ఉంటారు. ఈ మాసమంతా భగవత్ చింతనలోనే మహిళలు కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఇక ఈ నెలలో వరలక్ష్మీ వత్రం, మంగళగౌరీ వ్రతం, శ్రావణమాస వ్రతం, శివవ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం.. వంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతన తప్ప మరొకటి లేదు. శ్రావణ మాసంలో వర్షాల కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి అంటు రోగాలు వ్యాప్తి చెందుతాయి. వీటి నుంచి బయటపడేందుకే పెద్దలు వ్రతాలు సూచించారట.