పరమేశ్వరుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందిన కుబేరుడికి అందరికంటే తానే ధనవంతుడిననే అహంకారం పెరిగింది. దేవలందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా దేవలందరికీ ఆహ్వానం అందించాడు. ఇక మహాశివునికి తన ఇంటిని చూపించి ఆయన తన గొప్పతనాన్ని కీర్తిస్తుంటే దేవతలందరి ముందు తన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని భావించాడు. ఈ క్రమంలోనే కైలాసానికి వెళ్లి శివపార్వతులను తన ఇంట విందుకి ఆహ్వానించాడు. అయితే శివపార్వతులకు అప్పటికే కుబేరుని మనసులో ఏముందో అర్థమైంది.
తాము భోజనానికి రాలేమని చెబుతారు. ఆ సమయంలోనే వినాయకుడు బయటి నుంచి వస్తాడు. తనకు ఆకలిగా ఉందని తల్లి అయిన పార్వతి మాతకు చెబుతాడు. ఇక కుబేరుని గర్వమణచాలని భావించిన శివపార్వతులు కుబేరుని వెంట వినాయకుడిని పంపిస్తారు. వినాయకుడిని తీసుకెళ్లిన కుబేరుడు తన ఇంటిని చూపిస్తాడు. తనకు అవన్నీ పట్టమని భోజనాన్ని వడ్డించమని చెబుతాడు. దీంతో కుబేరుడు.. వినాయకుడికి భోజనం వడ్డిస్తాడు. దేవతలందరి కోసం తయారు చేసిన భోజనాన్ని వడ్డించినా కూడా గణేషుడి ఆకలి తీరదు.దీంతో వినాయకుడు ఆగ్రహంతో ఊగిపోతాడు. వెంటనే కుబేరుడు శివపార్వతులను వేడుకుంటాడు. అప్పుడు శివుడు కొంచెం బియ్యాన్ని కుబేరుడికి ఇచ్చి వాటిని వండి పెట్టమంటాడు. కుబేరుడు వండి భక్తితో వడ్డించడంతో గణేషుడు సంతృప్తి చెందుతాడు. దీంతో కుబేరుని గర్వం అణుగుతుంది.