కైలాస మానస సరోవర్ యాత్ర అంత సులువేం కాదు.. ఒకరకంగా ప్రాణాపాయ యాత్ర. వ్యయ ప్రయాసలతో కూడుకున్న యాత్ర. ఈ యాత్రకు వెళ్లేవారు ఒకప్పుడు అయితే దాదాపు 19వేల 500 అడుగుల ఎత్తైన ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో యాత్ర ముగియడం అనుకున్నంత సులువేం కాదు. చాలా ఇబ్బందులతో కూడుకున్నది.
ఈ యాత్ర చేయాలనుకునే వారు ముందుగా శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా సిద్దమవ్వాల్సి ఉంటుంది. ఈ యాత్రలో పొరపాటున భారత సరిహద్దుకు అవతల చనిపోతే.. దహన సంస్కారాలకు నోచుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే యాత్రికుల మృతదేహాన్ని తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉండదు. ఒకవేళ టిబెట్ భూభాగంలో చనిపోతే.. మృతదేహాన్ని అక్కడే దహనం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంతటి కఠినమైన యాత్రకు భక్తులు ఏమాత్రం వెనుకాడరు. ప్రాణాలకు తెగించి మరీ వెళతారు.