వేపంజరి శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం గురించి తెలుసా? ఈ చిత్తూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో వున్న వేపంజరి అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు. స్వామివారి ఈ విగ్రహం క్రీ.శ. 1178 – 1218 కాలంలో నిర్మించిబడింది. క్రీ.శ. 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో స్వామివారు వెలిశాడని చెబుతారు. కుళోత్తుంగ చోళుని పాలనలో ఒక వైష్ణవ భక్తుడు ఉండేవాడట. అతనికి ఒకరోజు శ్రీమన్నారాయణుడు కలలో కనిపించి తాను సమీపంలోనే పుట్టలో ఉన్నానని చెప్పాడట. వెంటనే వైష్ణవ భక్తుడు స్వామివారి కోసం వెదకనారంభించగా.. ఓ చిట్టడవిలోని పుట్టలో దర్శనమిచ్చాడట.
వైష్ణవ భక్తుడికి లభించిన శిలా ప్రతిమ స్వామివారు.. అమ్మవారిని తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో ఉందట. ఆ విగ్రహాన్ని కులోత్తుంగుడికి అందజేయగా.. పద్మపీఠంపై ప్రతిష్టింపజేసి అక్కడే ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడట. అలా శ్రీమన్నారాయణుడి ఆలయం నిర్మించబడింది. అప్పట్లో ఈ క్షేత్రం వేం పంచ హరిగా పిలవబడేది.. వేం అంటే పాపమని, పంచ అంటే ఐదు, హరి అంటే హరించడం మొత్తంగా పంచపాపాలను హరించే దేవుడని అర్థమట. ఇక్కడి స్వామివారిని భక్తితో మొక్కితే మన పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే కాలక్రమంలో వేం పంచ హరి కాస్త వేపంజరిగా మారిపోయింది.