శివాలయాలు దేశ వ్యాప్తంగా ప్రతి ఊరిలోనూ ఉన్నాయని ముందే తెలుసుకున్నాం కదా. రాజస్థాన్‌లోని ఓ ప్రదేశంలో 5 శివాలయాలున్నాయి. అవి దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వాటి గురించి తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి 35 కి.మీ దూరంలో, థార్ ఎడారి సమీపంలో ఉన్న పట్టణంలో ఈ దేవాలయాలున్నాయి. వీటిని కిరాడు దేవాలయాలని పిలుస్తారు. ఇవి సోలంకి నిర్మాణ శైలికి ప్రసిద్ధి గాంచాయి. ఈ ఆలయాలు శివునికి అంకితం చేయబడినవి. ఈ ఐదు దేవాలయాల్లోనూ సోమేశ్వరాలయం చాలా విశిష్టతగాంచింది. వాటిలో బార్మర్ ఫోర్ట్ అండ్ గర్ దేవాలయం గురించి తెలుసుకుందాం.
రావత్ భీమా 1552 ఏడీలో ప్రస్తుత బార్మర్ నగరంలోని కొండ వద్ద బార్మర్ కోటను నిర్మించాడు. ఈ కోటను బార్మర్ గర్ అని కూడా పిలుస్తారు. ఈ కోట నిర్మాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. 1383 అడుగుల కొండపై 676 అడుగుల ఎత్తులో కోటను రావత్ భీమా నిర్మించాడు. ఈ బార్మర్ కోట కొండ రెండు ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలకు నిలయం కావడం విశేషం. ఈ కొండ పైభాగంలో 1383 ఎత్తులో ఉన్న జోగ్మయా దేవి (గర్ మందిర్) ఆలయం ఉంటే.. 500 అడుగుల ఎత్తులో నాగ్నేచి మాత ఆలయం ఉంది. రెండు ఆలయాలు చాలా ప్రసిద్ధి గాంచాయి. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల ను ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.