అయ్యప్ప స్వామి ఆలయాలు దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఇతర అయ్యప్ప స్వామి ఆలయాల గురించి స్థానికులకు తప్ప పెద్దగా బయటివారికి తెలిసే అవకాశం లేదు. అలాంటి ఆలయాల్లో తుమ్మగుంట శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రం ఒకటి. ఇది ఏపీలోని నెల్లూరు జిల్లాలో తుమ్మగుంటలో ఉంటుంది. దాని విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇది ఈనాటి ఆలయం కాదు. 15వ శతాబ్ద కాలం నాటిదని చెబుతారు. ఈ ఆలయ చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
తుమ్మగుంట అయ్యప్ప స్వామి ఆలయంలో 1947 నుంచి కార్తీక పౌర్ణమికి లక్ష తులసి పూజ విశేషంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ సందర్భంగా గ్రామోత్సవం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి, నెల్లూరు నగరం నుంచి అసంఖ్యాకమైన ప్రజలు పాల్గొంటారు. ఆసక్తికరంగా శబరిమల ఆలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా మకరజ్యోతి దర్శనమిస్తుంది. తుమ్మగుంట అయ్యప్పస్వామి ఆలయంలో 1980వ సంవత్సరంలో మకర జ్యోతి దర్శనాన్ని మొదలు పెట్టారు. అది ఈ నాటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇక్కడ జ్యోతి దర్శనం కలుగుతుంది. ఇది ఎంతో ప్రత్యేకం. కార్తీక పౌర్ణమి రోజున జ్యోతి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.