సోమనాధేశ్వర ఆలయ విశేషాలేంటో తెలిస్తే..!

మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటే సోమనాథ్ క్షేత్రం. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరావల్‌లో ఉంది. ప్రభాస తీర్థం అని కూడా పిలవబడే ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. చంద్రుడిని సోముడని కూడా అంటారు. సోముడు నిర్మించాడు కాబట్టే ఇక్కడి స్వామివారిని సోమనాధీశ్వరుడని అంటారు. ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించిన అనంతరం.. రావణుడు వెండితోనూ.. శ్రీకృష్ణుడు కొయ్యతోను, భీముడు రాతితోను తిరిగి నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో అపార సంపద ఉండటంతో చాలా సార్లు దోపిడీకి గురైంది.

ఘజనీ మహ్మద్, అల్లాయుద్దీన్ ఖిల్జీ.. ఔరంగజేబు తదితర ముస్లిం రాజులంతా ఈ ఆలయంలోని సంపదను దోచుకుని ఆలయాన్ని ధ్వంసం చేశారు. గుజరాత్‌లోని అరేబియన్ సముద్ర తీరాన ఈ ఆలయం ఉంది. ఆలయం లోపల అంతా బంగారంతో నిర్మితమైంది. అందమైన శిల్ప కుడ్యాలతో అద్భుతంగా ఉంటుంది. ఇక సోమనాధేశ్వరుడి విషయానికి వస్తే లింగ రూపంలో దర్శనమిస్తాడు. చాలా పెద్ద శివలింగం గర్భగుడిలో దర్శనమిస్తుంది. దీని వెనుక పార్వతీ దేవి విగ్రహం.. ద్వారానికి కుడి పక్క వినాయకుడు.. ఎడమపక్క ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. నిత్యం ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆలయాన్ని సాగర కెరటాలు నిత్యం తాకుతూ ఉంటాయి. ఇది అంతా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

Share this post with your friends