వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున సీతా నవమిగా భావిస్తారు. ఈ రోజున ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిదని భావిస్తారు. సీతాదేవి ఈ రోజున జన్మించిందని చెబుతారు. ఈ రోజున సీతాదేవిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయట. ఇక మే 16న సీతానవమి రానుంది. పురాణాల ప్రకారం మార్వార్ ప్రాంతంలో దేవదత్ అనే బ్రాహ్మణుడు నివసించాడు. అతని భార్య శోభన చాలా అందంగా ఉండేది. దేవదత్ భగవత్ చింతనలో మునిగి తేలుతుంటే.. శోభన మాత్రం అందగత్తెననే అహంకారంతో ఉండేది. ఇతరులను చాలా నీచంగా చూసేది.
ఒకరోజు శోభన కంటే అందగత్తెలు ఆ గ్రామానికి వచ్చారు. వారిని చూసి అసూయతో శోభన గ్రామం మొత్తాన్ని తగులబెట్టి తను కూడా మరణించింది. తరువాతి జన్మలో శోభన చండాలిగా పుట్టి అనేక అవమానాలు ఎదుర్కొంది. అయితే చండాలి సీతమ్మ భక్తురాలు. ఒకరోజు తన ఆవేదననంతా సీతమ్మ ముందు వెళ్లగక్కింది. దీంతో సీతమ్మ చండాలికి పూర్వ జన్మను గుర్తు చేసింది. పశ్చాత్తాపంతో పాప విముక్తి కోసం చండాలి వైశాఖ మాసం నవమి రోజున ఉపవాసం చేసి పూజ చేసింది. దీంతో సీతమ్మ ఆమె పాపాలను పొగొట్టింది. సీతాదేవి భక్తికి సంతసించి క్రమంగా పాపాలను పోగొట్టుకుంది. అప్పటి నుంచి సీతా నవమికి ప్రాధాన్యత సంతరించుకుంది.