కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికి, సాగునీటికి లోటు లేకుండా చేస్తున్న నది కావేరి. ఈ నదీ తీరంలోనే వైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగక్షేత్రం, శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఇక్కడ చెప్పుకోవల్సిన మరో ఆలయం నిమిషాంబ దేవి ఆలయం. పార్వతీ దేవి అవతారమే నిమిషాంబ దేవి. కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరులో ఉంటుందీ నిమిషా దేవి ఆలయం. శివుని అంశగా భావించే ముక్తకుడు అనే రుషి లోకకల్యాణార్థం ఒక యాగాన్ని తలపెట్టాడట. ఆ యాగం జరిగితే తమకు ఇబ్బందేనని భావించిన రాక్షసులు ఆ యాగాన్ని చెడగొట్టేందుకు యత్నించారట.
ఎంత ప్రయత్నించినా కూడా ముక్తక రుషి వారిని అడ్డుకోలేకపోయారట. అప్పుడు పార్వతీ మాత యజ్ఞగుండంలో నుంచి ఉద్భవించి, రాక్షస సంహారం కావించిందట. ఆ ఘటన గంజాం ప్రాంతంలో జరిగిందని.. అలా ఉద్భవించిన పార్వతీమాతే నిమిషాదేవి అని ఇక్కడి వారి నమ్మకం. 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో అమ్మవారితో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తారు. ఇక నిమిషాదేవి ఆలయం పక్కనే శివుడి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడ శివయ్యను ముక్తికేశ్వరుడని అంటారు. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తారు.ఆ నిమ్మకాయను తీసుకెళ్లి పూజ గదిలో పెట్టుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయట. ఇక్కడ మరో వివేషమే బలి భోజనం. అంటే కాకులకు భోజనాన్ని అందిస్తారు. ఆహారాన్ని బలిపీఠంపై పెట్టి గంట మోగిస్తే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఈ భోజనాన్ని ఆరగిస్తాయట. ఇక్కడి అమ్మవారిని ఏ కోరిక కోరినా నిమిషంలో తీర్చేస్తుందని భక్తులు చెబుతారు.