హనుమంతుడిని సప్త చిరంజీవులలో ఒకరిగా పరిగణిస్తాం. శివుడి అంశంతో హనుమంతుడు పుట్టాడని కాబట్టి సమస్త గ్రహ దోషాలు, బాధలు ఆయనను పూజిస్తే తగ్గుతాయని అంటారు. అయితే హనుమంతుడికి 9 రూపాలున్నాయి. వాటి గురించి చాలా తక్కవు మందికి తెలుసు. అవేంటో చూద్దాం.
ప్రసన్న ఆంజనేయస్వామి: హనుమంతుడు వాస్తవానికి ప్రసన్న వదనుడిగా ఉంటాడు. చేతిలో గద పట్టుకుని అభయం ఇస్తున్నట్టు వరద ముద్రలో ప్రశాంతంగా కనిపిస్తాడు కాబట్టి ప్రసన్నాంజనేయ అని పిలుస్తారు.
వీరాంజనేయస్వామి: హసీతాన్వేషణలో భాగంగా సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు చెప్పగా తన శక్తులను గుర్తుచేసుకుని సముద్రాన్ని దాటుతాడు. ఆ సమయంలో వీరాంజనేయ స్వామి రూపంలో ఉంటాడు.
వింశతి భుజం: రామాయణ యుద్దంలో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో ఆంజనేయుడు తన శక్తిని పెంచుకోవడానికి ఇరవై ఆయుధాలను ఉపయోగించగల రూపాన్ని తీసుకున్నాడట. దీన్నే వింశతి భుజ ఆంజనేయస్వామి రూపం అంటున్నారు.
పంచముఖి: రామ లక్ష్మణులను మహిరావణు అపహరిస్తారు. అప్పుడు హనుమంతుడు అహిరావణ, మహిరావణులను వధించడానికి పంచముఖి ఆంజనేయస్వామి రూపం దాల్చుతాడు.
అష్టాదశ భుజ: రామ-రావణ యుద్ధంలో లంక సైన్యాధిపతులలో ఒకరైన అతికాయుడు అనే రాక్షసుడి విల్లును విరగ్గొట్టడానికి ఆంజనేయస్వామి అష్టాదశభుజ అనే రూపాన్ని తీసుకున్నాడు
సువర్చలపతి: హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవనిని తీసుకురావడం కోసం మేరు పర్వతానికి వెళతాడు. అక్కడ సంజీవని ఏదో తెలియక మేరు పర్వతంలో ఒక భాగాన్ని పెకిలించి తీసుకువస్తున్నప్పుడు సువర్చలపతి రూపాన్ని దాల్చాడట.
చతుర్భుజ ఆంజనేయుడు: లంక ప్రయాణంలో సైన్యం కరువుతో బాధపడుతూ ఉంటుంది. వారికి ఆహారం అందించడానికి హనుమంతుడు చతుర్భుజ రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో సైన్యం ఆకలి తీర్చాడట.
ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి: రామాయణ యుద్దంలో రావణుడు గ్రహయుద్దంలో గ్రహాలను ఉపయోగిస్తాడు. ఆ గ్రహాలు లొంగిపోయేలా చేయడం కోసం భయంకరంగా, ఉగ్రంగా ఉన్న ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి రూపం తీసుకుని ఆ గ్రహాలను లొంగదీసుకున్నాడట.
వానరాకార ఆంజనేయస్వామి: లంకకు వెళ్లే మార్గాన్ని వెతుకుతున్నప్పుడు హనుమంతుడు వానర రూపాన్ని ధరించాడట.హనుమంతుడు వానరుడైనా ఆయన రూపం ఇతర వానరులకు విభిన్నంగా మనుష్య రూపంలో కలిసిపోయి ఉంటుంది.