అన్నదమ్ములంటే అంతా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను చూపిస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడా ఏ రామ మందిరంలోనూ ఈ సోదరుల విగ్రహాలు మాత్రం కనిపించవు. అయితే ఈ నలుగురు అన్నదమ్ముల ఆలయాలను వీక్షించాలంటే కేరళ వెళ్లాల్సిందే. ఈ యాత్రను నాలాంబళం యాత్రగా పిలుస్తారు. కేరళలోని త్రిస్సూర్, ఎర్నాకుళం జిల్లాల్లో ఈ యాత్ర ఉంటుంది. మలయాళంలో నాల్ అంటే నాలుగు.. అంబళం అంటే దేవాలయం. రామయ్యతో పాటు ఆయన సోదరుల ఆలయాలను ఒక్క రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబళ యాత్ర అని చెబుతారు. ఒకేరోజులో ఈ యాత్ర పూర్తి చేస్తే మంచి జరుగుతుందట. ఈ యాత్ర మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కాడకం అంటే జులై-ఆగస్టు నెలలో ఉంటుంది.
మొదట త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ ఆలయంలోని శ్రీరాముడిని దర్శించుకోవాలి. అక్కడి రామయ్య ఆరుడగులు ఉంటాడు. పూలమాలను ధరించి శంఖము, సుదర్శన చక్రంతో కళకళలాడుతూ ఉంటాడు. ఇక రామయ్య దర్శనానంతరం ఇరింజల్‌కుడలోని కూడల్‌మాణిక్యం ఆలయానికి చేరుకుని ఇక్కడ భరతుని ఆలయాన్ని దర్శించుకోవాలి. అనతంరం లక్ష్మణుడి దర్శించుకునేందుకు ఎర్నాకుళం జిల్లాలోని అంగమాలి ప్రాంతంలోని మూళికులానికి చేరుకుంటే.. అక్కడ పూర్ణా నది సమీపంలో లక్ష్మణ్ పెరుమాళ్ ఆలయం ఉంటుంది. ఇక్కడ లక్ష్మణుడిని దర్శించుకున్న అనంతరం చివరిగా శత్రుఘ్నుడిని దర్శించుకునేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. త్రిస్తూర్ జిల్లాలోనే శత్రుఘ్నస్వామి ఆలయం ఉంది. ఈయనను దర్శించుకోవడంతో నాలాంబళం యాత్ర పూర్తవుతుంది.