త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువుకు ఒక ప్రత్యేక స్థానముంది. ఆయనే లోక సంరక్షణ కోసం పలు అవతారాలు ఎత్తాడని అంటారు. ప్రపంచంలో ధర్మం నశించి అవినీతి అరాచకం పెచ్చుమీరినప్పుడల్లా ఏదో ఒక అవతారమెత్తి దుష్ట శిక్షణ.. భక్త రక్షణ చేస్తుంటాడు. అలాంటి విష్ణుమూర్తి సైతం ఒక శాపానికి గురయ్యాడు. అసలు ఆయనను శపించింది ఎవరు? అంటే.. విష్ణుమూర్తిని బృందా దేవి శపించింది. ఆ శాప విమోచనం కలిగిన ప్రదేశంలో ఓ ఆలయం కూడా నిర్మించబడింది. దాని విశిష్టతను గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ విష్ణు మూర్తి దేవాలయాన్ని ముక్తినాథ్ ఆలయమని పిలుస్తారు.
ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్ధం. ఇది నేపాల్‌లో ఉంది. నేపాల్‌లోని ముక్తినాథ్ లోయలోని ముస్తాంగ్‌లోని తోరోంగ్ లా పర్వతంపై ఉంది. ప్రపంచంలో అతి ఎత్తైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఎంత ఎత్తులో ఉంటుందో తెలుసా? సముద్ర మట్టానికి సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తిని శాలిగ్రామ రూపంలో పూజిస్తారు. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించాయట. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తారు.