కాశీ అనేది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఎన్నో ప్రముఖ ఆలయాలున్నాయి. కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణా దేవి గురించి అయితే అందరికీ తెలుసు కానీ మరికొన్ని ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మాత్రం కొందరికే తెలుసు. వాటిలో మయూఖాధిత్యుడి ఆలయం కూడా ఒకటి. ఈ స్వామివారు పవిత్ర గంగానదీ తీరంలోనే మనకు దర్శనమిస్తారు. అక్కడ ఉండే పంచగంగ రేవు సమీపంలో సూర్యుడు మయూఖాదిత్యుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. కాశీలోని మయూఖాదిత్యుని దర్శించిన వారికి చాలా మంచి జరుగుతుందట.
మయూఖాదిత్యుని దర్శించుకుంటే జీవితంలో దారిద్య్ర బాధలుండవట. ఇలా సాక్షాత్తూ ఆ పరమ శివుడే వారం ఇచ్చాడు. కాబట్టి కాశీకి వెళ్లిన వారు తప్పకుండా మయూఖాదిత్యుని దర్శించుకోవాలని చెబుతారు. మయూఖాదిత్యుని దర్శనం, పూజలు చేసిన వారికి ఈ ఒక్క జన్మలోని దారిద్ర్య బాధలే కాదు.. ఏడు జన్మల వరకూ దారిద్య్ర బాధలుండవట. కాశీకి వెళ్లిన వారు ముందుగా గంగలో స్నానమాచరించి విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవిని దర్శించుకోవాలి. అనంతరం సూర్య దేవాలయాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా దారిద్య్ర బాధలను పోగొట్టే మయూఖాదిత్యుని ఆలయానికి అయితే సూర్యోదయ సమయంలో చేరుకుంటే మంచిదట. మయూఖాదిత్యుడికి 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలట. ఇక దీంతో అంతా మంచి జరుగుతుందని నమ్మకం.