మరుద్గణముల గురించి తెలుసా?

మరుద్గణముల గురించి మీకు తెలుసా? దీని గురించి భాగవత పురాణంలో ఒక కథ కూడా ఉంది. కశ్యపునికి దితి, అదితి అని ఇద్దరు భార్యలు. అదితి కుమారులేమో ఇంద్రాది దేవతలు కాగా.. దితి కుమారులు హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు. విష్ణు మూర్తి సాయంతో తన కుమారులను ఇంద్రుడు చంపించాడని కోపంతో ఉన్న దితి.. తనకు ఇంద్రుడిని చంపే కుమారుడిని ప్రసాదించమని భర్త కశ్యపుడిని కోరింది. భార్యమాట కాదనలేక ఆ వరం ఇచ్చాడు కశ్యపుడు కానీ కొన్ని నిబంధనలు పెట్టాడు. ఆ నిబంధనలను గర్భంతో ఉండగా అతిక్రమిస్తే, పుట్టే కుమారుడు ఇంద్రుడికి మిత్రుడు అవుతాడు అని తెలిపగా దీనికి దితి సరే అంది. ఇది తెలిసిన ఇంద్రుడు పినతల్లి దితి వద్దకు వచ్చాడు. ఆమెకు సేవలు చేస్తూ నిబంధనలు ఎప్పుడు అతిక్రమిస్తుందా? అని చూశాడు.

ఒక రోజు దితి ఒక నిబంధన అతిక్రమించింది. వెంటనే ఇంద్రుడు దితి గర్భంలోకి ప్రవేశించి.. లోపల ఉన్న పిండాన్ని ఏడు భాగాలుగా నరికాడు. ఆ పిండాలు ఏడవడం మొదలు పెట్టాయి. ఏడవకండి ఏడవకండి (మా రుతః అంటే ఏడవకండి. అందుకే వారి పేరు మరుత్తులు) అంటూనే మరలా ఒక్కొక్క భాగాన్ని ఏడుగా నరికాడు. మొత్తం నలభైతొమ్మిది భాగాలవగా.. అప్పుడు వారంతా తమను ఎందుకు నరికావని ఇంద్రుడిని అడిగాయి. మీరు నన్ను చంపడానికే పుడుతున్నారని ఇంద్రుడు చెప్పగా.. తాము సంహరించబోమని మిత్రులుగా ఉంటామని చెప్పారు. దీంతో ఇంద్రుడు వారికి దైవత్వం ప్రసాదించాడు. ప్రసవానంతరం 49 మంది మరుత్తులు జన్మించడం చూసి దితి ఆశ్చర్యపోయింది. అప్పుడు ఇంద్రుడు జరిగిన విషయమంతా చెప్పాడు. తన కుమారులు దేవతా గణములు అయినందుకు దితి సంతోషించింది. అప్పటి నుంచి వారు వాయువుకు అధిష్ఠాన దేవతలుగా, మరుత్తులుగా ప్రసిద్ధికెక్కారు. వారినే మరుద్గణములు అని అంటారు.

Share this post with your friends