కన్వర యాత్ర గురించి తెలుసా?

శ్రావణ మాసాన్ని హిందువులు చాలా విశిష్టమైనదిగా చూస్తారు. ఈ మాసంలో పూజలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఉత్తరాదిలో అయితే ఈ శ్రావణ మాసంలో కన్వర యాత్ర ప్రారంభమవుతుంది. దక్షిణాది వారికి దీని గురించి పెద్దగా తెలియదు. శివ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన యాత్ర ఇది. ప్రతి ఏడాది లక్షలాది మంది కన్వాడీలు కాలి నడకన కన్వర యాత్ర నిర్వహిస్తూ ఉంటారు. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని కావిడిలో తీసుకుని తమ ప్రాంతంలోని శివాలయానికి వెళ్లి శివలింగాన్ని అభిషేకిస్తారు. దీనికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని ఉల్లంఘిస్తే శివయ్య ఆగ్రహానికి గురి కావల్సిందేనట.

ఇక ఈ సంవత్సరం కన్వర యాత్ర జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్ట్ 2 వరకూ కొనసాగనుంది. తొలుత ఈ యాత్రను పరశురాముడు ప్రారంభించాడని చెబుతారు. ఆయన గర్హ ముక్తేశ్వర్ ధామ్ నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి యూపీలోని బాగ్‌పత్ సమీపంలోని ‘పుర మహాదేవుడిని అభిషేకించాడట. నాటి నుంచి కన్వర యాత్రను శివుడి భక్తులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ యాత్ర చేపట్టే భక్తులను కన్వరియా అని పిలుస్తారు. ఈ యాత్ర నిర్వహించే భక్తులంతా కాలి నడకనే ప్రయాణించాలి. నేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కావడిని దించకూడదు. పొరపాటున నేలపై దించితే తిరిగి మళ్లీ పవిత్ర జలంతో నింపాల్సి ఉంటుంది. గంగ నీరు లేదంటే ఏదైనా పవిత్ర నది నుంచి నీటిని తీసుకెళ్లవచ్చు.

Share this post with your friends