కాలా అంటే నలుపు. ఈ ఆలయంలో రామయ్య తండ్రి నల్లని రాయితో చెక్కబడి ఉంటాడు కాబట్టి కాలా రామాలయం అని దీనికి పేరొచ్చింది. ఈ ఆలయంలో శ్రీరాముడి నల్లటి విగ్రహం ఉంటుంది. రామయ్యకు కుడి, ఎడమల్లో లక్ష్మణుడు, సీతా దేవి.. ఎదురుగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులను కత్తిరించాడట. ఇక ఈ ఆలయ ప్రాంతంలోనే శ్రీరాముడు.. రావణుడి సోదరులైన ఖర్-దూషన్ అనే రాక్షసుల మధ్య యుద్ధం జరిగిందట. వీరిని శ్రీరాముడు సంహరించాడు. ఆ తరువాత ఈ ప్రాంతం నుంచే సీతాదేవి అపహరణకు గురైందని చెబుతారు. పంచవటిలో ఉంది కాబట్టి కాబట్టి ఈ ఆలయానికి చాలా ప్రాధాన్యాన్ని హిందువులు ఇస్తారు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని నాసిక్ అని పిలుస్తున్నారు.
అయితే ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ఉంది. శ్రీరాముడు పధ్నాలుగేళ్ల వనవాసంలో భాగంగా పంచవటికి రాగా.. అక్కడి ఋషులు రాక్షసుల బారి నుంచి తమను రక్షణ కల్పించాలని కోరారట. అప్పుడు రాములవారు ఋషుల కోరికను మన్నించి నల్లని రూపాన్ని ధరించి రాక్షసులు బారి నుంచి వారిని కాపాడట. అందుకే అక్కడ నేటికీ స్వామివారి విగ్రహం నల్లగా ఉంటుందని చెబుతారు. ప్రస్తుతమున్న రామాలయంలో 14 మెట్లు ఉన్నాయి. అవి రాముల వారి పధ్నాలుగేళ్ల వనవాసాన్ని సూచిస్తాయని చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది కాగా.. దీనిని పేష్వాకు చెందిన సర్దార్ రంగారావు ఒధేకర్ 1788లో పునర్మించడం జరిగింది.