కొన్ని ఆలయాల్లో అద్భుతాలు సంభవిస్తూ ఉంటాయి. అటువంటి అద్భుతాల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం శాస్త్రవేత్తల వల్ల కూడా కాదు. ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువైన అమ్మవారు.. పీతాంబర దేవి. ఈ ప్రసిద్ధ సిద్ధ పీఠాన్ని సిద్ధ సంత్ స్వామి 1935లో స్థాపించారు. ఇక్కడి అమ్మవారిని రాజసత్తా దేవత, బగళాముఖీ దేవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారికి భక్తితో మొక్కి పసుపు వస్త్రాలు ధరించి.. పసుపు హారతి ఇస్తే చాలు కోరిన కోరిక తప్పక నెరవేరుతుందని నమ్మకం. ఇక ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువగా పూజలు చేస్తుంటారు.
ఈ అమ్మవారికి మొక్కితే అధికార పీఠాన్ని తప్పక అధిష్టిస్తారట. కాబట్టి పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఇక్కడి అమ్మవారు మూడు కాలాల్లో మూడు రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఉదయాన్నే అమ్మవారి రూపాన్ని దర్శించుకుంటే ఒకరకంగా కనిపిస్తుంది. గంటకే మరోసారి దర్శించుకుంటే మరొక రూపాన్ని చూసే భాగ్యం కలుగుతుంది. అసలు ఈ అమ్మవారు ఎందుకలా రూపాన్ని మార్చుకుంటోంది? ఇది ఎలా సాధ్యపడుతోందన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కని రహస్యం. శాస్త్రవేత్తలు సైతం ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే పీతాంబర అమ్మవారిని హారతి సమయంలో మాత్రమే దర్శించుకోవచ్చు. మిగిలిన సమయంలో ఆలయ తలుపులు మూసివేసి ఉంచుతారు. ఆ సమయంలో ఓ చిన్న కిటికీ ద్వారా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు.