చైనీయుల కాళి మాత గురించి తెలుసా? నూడిల్స్, చోప్సే అమ్మవారి నైవేద్యం..

చైనీయులు హిందూ దేవతలను పూజిస్తారా? అంటే ఇక్కడ మాత్రం కచ్చితంగా పూజిస్తారు. అదెక్కడో కాదు.. కోల్‌కతలో. అమ్మవారికి భాషా భేదమో.. ప్రాంత భేదమో ఉండదు కదా.. భక్తితో మొక్కితే ఎవరినైనా కరుణిస్తుంది. కోల్‌కతాలోని టాంగ్రా అనే ప్రాంతంలో చైనీయులు కొన్ని దశాబ్దాలుగా స్తిరపడ్డారు. వీరిక్కడ తోలు వ్యాపారం చేస్తుంటారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. కోల్‌కతలోని ఈ ఒక్క ప్రాంతంలో చైనీయులు సంస్కృతి సంప్రదాయం దర్శనమిస్తుంది. ఇక్కడే కాళి మాత ఆలయం ఉంటుంది. ఈ దేవాలయంపై ‘చైనీస్ కాళి మందిర్’ అని రాసి ఉంటుంది. 60 ఏళ్ల క్రితం ఇక్కడ రెండు రాళ్లుండేవట. వాటినే కాళికా దేవిగా భావించి బెంగాలీలు పూజలు చేసేవారు.

అయితే ఒకసారి చైనీయుల పిల్లవాడు ఒకరికి జబ్బు చేసిందట. ఎంత మంది వైద్యుల వద్దకు వెళ్లినా నయం కాలేదట. దీంతో వారు అమ్మవారిని కాపాడాలంటూ వేడుకున్నారట. ఆశ్చర్యకరంగా పిల్లవాడికి జబ్బు పూర్తిగా నయమైందట. అప్పటి నుంచి టాంగ్రాలో నివసించే చైనీయులందరికీ అమ్మవారు ఆరాధ్య దైవంగా మారిపోయింది. గ్రానైట్ రాళ్లతో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడిల్స్, చోప్సే వంటివి పెడుతుంటారు. ఇక్కడంతా చైనీయుల సంప్రదాయం ప్రకారమే జరుగుతుంటుంది.

Share this post with your friends