ఆజన్మ బ్రహ్మచారి అయినా ఆంజనేయుడికి వివాహమైన విషయమే చాలా మందికి తెలియదు. ఇక కొడుకు కూడా ఉన్నాడన్న విషయమైతే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇక హనుమంతుడి భార్య గురించి అయితే మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు కొడుకు గురించి చూద్దాం. హనుమంతుడికి కొడుకు ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే తనకు కొడుకున్న విషయం హనుమంతుడికి కూడా తెలియదట. పాతాళంలో మైరావణుడి దగ్గర ఉన్న శ్రీరాముడు, లక్ష్మణులను రక్షించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయనకు కొడుకు గురించి తెలిసిందట.
రామ, లక్ష్మణులను విడిపించేందుకు వెళ్లిన ఆంజనేయుడు అక్కడ ఉన్న మకరధ్వజుడితో భీకర యుద్ధం చేశాడట. చివరకు అతడిని ఓడించి మైరావణుడి చెర నుంచి రామలక్ష్మణులను విడిపించాడట. అప్పుడే తను యుద్ధం చేసింది మరెవరితోనో కాదు.. తన కుమారుడైన మకరధ్వజుడితోనేనని తెలిసిందట. మరి హనుమంతుడికి తెలియకుండా మకరధ్వజుడు ఎలా జన్మించాడంటారా? లంకలో ఉన్న సీతాదేవి జాడను వెదికి పట్టుకున్నప్పుడు హనుమంతుడి తోకకు రావణ సేన నిప్పంటించడంతో లంక మొత్తాన్ని తగుల బెట్టాడు. అనంతరం తన తోకకు అంటుకున్న మంటను ఆర్పేందుకు సముద్రపు నీటిని వినియోగిస్తున్న సమయంలో తన శరీరం నుంచి చెమట చుక్క నీటిలోకి జారిందట. దానిని చేప మింగడంతో మకరధ్వజుడు జన్మించాడు. మకరధ్వజుడు తండ్రి వలే చాలా శక్తిమంతుడు.