ప్రపంచంలో రకరకాల గణపతి ఆలయాలున్నాయి. ఇక్కడ గణపతి ఆలయంలో వినాయకుడి తల మాత్రమే పూజలు అందుకుంటుంటే మరో దేవాలయంలో మొండం పూజలు అందుకుంటోంది. మరో ఆలయంలో నరుడి రూపంలో వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని అంటారు. ఇక్కడి కేదార్ లోయలోని ముండ్‌కతీయ అనే ఆలయంలో వినాయకుడు తల లేని గణేశుడిని పూజిస్తారు. ఇక్కడ వినాయకుడి తల లేని శరీరం మాత్రమే పూజలు అందుకుంటూ ఉంటుంది.
శివుడు గణేశుడి తలను నరికిన అనంతరం ఆ బాలుడి శరీరానికి ఉత్తర దిశలో నిద్రపోతున్న ఏనుగు తలను తీసుకువచ్చి.. జోడించి ప్రాణం పోసిన విషయం తెలిసిందే. అయితే తల ఒకచోట, తల లేని శరీరం మరో చోట పూజలు అందుకుంటోంది. అదే ముండ్‌కతీయ. ఇక్కడ వినాయకుడికి తల ఉండదు కాబట్టి ఈ ప్రాంతానికి ముండికతీయ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయం సోన్ ప్రయాగ నుంచి 3 కి.మీ దూరంలో ఉంటుంది. నిన్న వినాయక చవితి సందర్భంగా ఇక్కడి వినాయకుడిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.